పాఠశాల విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్ధులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 1,2 తరగతులకు రెండు పుస్తకాలు, 3 నుంచి 5 తరగతులకు నాలుగు పుస్తకాలు ఉండనున్నాయి. సంవత్సరానికి రెండుసార్లు ప్రభుత్వం పుస్తకాలు అందించనుంది. బడులు తెరిచే జూన్‌లో మొదటి సెమిస్టర్ పుస్తకాలు, తరవాత రెండో సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. 1,2 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి రెండు పుస్తకాలే ఉంటాయి. ప్రస్తుతం వారికి ఆరు పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, గణితం పుస్తకాలు కలిపి ఒకటి చేయనున్నారు.
3,4,5 తరగతులకు నాలుగు పుస్తకాలు ఉంటాయి. వీరికి ఇంగ్లీష్, తెలుగు కలిపి ఒకే పుస్తకంగా ఉంటుంది. గణితం, ఈవీఎస్ మరొకటి ఉంటుంది. వీరికి మరో రెండు వర్క్ బుక్స్ ఉంటాయి. ఆరు నుంచి తొమ్మిది వరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒకే పుస్తకంగా ఉండనున్నాయి. మిగతా సబ్జెక్టులకు విడిగా పుస్తకాలు ఇస్తారు. సెమిస్టర్ విధానం వల్ల పుస్తకాల బరువు సగానికి తగ్గనుంది. విద్యా మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో అధికారులు కసరత్తు చేసి పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చారు.
మహారాష్ట్రలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేశారు. సెమిస్టర్ విధానం ఇప్పటికే పలు కోర్సుల్లో అమల్లో ఉంది. అయితే ప్రాధమిక విద్యలో కూడా సెమిస్టర్ విధానం తీసుకురావడం వల్ల పుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. సెమిస్టర్ విధానంలో విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గనుంది.
మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పది వేల ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ మొదటి ఏడాదితో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ తీసుకువస్తున్నారు. విద్యార్ధులు వైద్య, ఇంజనీరింగ్ విద్యకు అర్హత సాధించేలా ఎంబైపీసీని ప్రవేశ పెడుతున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు తయారు చేశారు. ఈ వివరాలు ఆన్‌లైన్ చేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉపాధ్యాయులు సవరణలు కోరవచ్చు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.