భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కిడ్నాప్ వ్యవహారంలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంట్లకు సహకరించిన ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని టర్బాట్‌లోని మసీదులో ప్రార్థనలు ముగించుకుని వెళుతోన్న ముఫ్తీపై దుండగులు కాల్పులు జరిపి చంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. గతంలోనూ రెండుసార్లు ముఫ్తీపై కాల్పులు జరిగాయి.
మత సంస్థ జేయూఐలో ముఫ్తీ షా మీర్ సభ్యుడు. ఆయుధాలు, మానవ అక్రమ రవాణాలో ముఫ్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తరచూ పాకిస్థాన్ చొరబాటుదారుల శిబిరాలను సందర్శిస్తూ ఉంటాడు. గత వారం జేయూఐ సభ్యులను ఖజ్దార్ ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
కులభూషణ్ జాదవ్ భారత నేవీ నుంచి పదవీ విరమణ పొందిన తరవాత ఇరాన్ దేశంలో వ్యాపారం నిర్వహించాడు. 2016లో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇరాన్‌లోనే పాకిస్థాన్ ఏజంట్లు కిడ్నాప్ చేశారని భారత్ వాదిస్తోంది. జాదవ్‌కు పాక్ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు విచారణలో ఉంది.