శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారు నేడు విహారం
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి ( మార్చి 9ఆదివారం) రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు 13వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతీ ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు కొనసాగుతాయి.
నేటి సాయంత్రం సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో విహరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
పడవలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం గా పిలుస్తారు. వీటినే తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అని కూడా పిలుస్తారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి నిర్వహిస్తుండగా శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు.