మరింత పకడ్బందీగా భక్తులకు సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు, సేవలు, వసతుల బుకింగ్ లో దుర్వినియోగం, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కీలక చర్యలు చేపట్టనుంది. సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది. అందుకు అవసరమైన సహాయకారాలను ఏపీ ప్రభుత్వం అందజేయనుంది.
టీటీడీలో ఆధార్ వినియోగానికి అవసరమైన అనుమతినిస్తూ గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ సమ్మతి తెలిపింది. సదరు నోటిఫికేషన్‌ను దేవాదాయ శాఖ శనివారం గెజిట్‌లో ప్రచురించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఆధార్ ఆథెంటికేషన్ తో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల గుర్తింపును పరిశీలించడంతో పాటు ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు, సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ క్రమబద్ధీకరణ సులువుగా ఉంటుంది.
భక్తుల ఆధార్ ఆథెంటికేషన్ కు అనుమతి ఇవ్వాలని గతేడాది జులైలో దేవాదాయ శాఖకు అప్పటి టీటీడీ ఈవో లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి చేరవేసింది. ఆగస్టులో కేంద్రం నుంచి అనుమతి రాగానే నవంబరు 18న పాలకమండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుగుణంగా ఇప్పుడు గెజిట్ జారీ చేశారు.