తల్లి కోసం ఓ వ్యక్తి లక్షల జీతాన్ని వదిలేశాడు. ఏ మాత్రం అసంతృప్తి లేకుండా అమ్మసేవ, దైవ స్మరణలోనే ఏళ్ళుగా తరిస్తున్నాడు. మాతృమూర్తి కోరిక మేరకు స్కూటర్‌పై ఆమెను తీర్థయాత్రకు తీసుకెళ్ళాడు. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన కృష్ణకుమార్(39) తన తల్లి చూడరత్నమ్మ(70)తో కలిసి దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. .
ఇప్పటి వరకు ద92,591 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తల్లీకుమారులు శనివారం నాడు కాకినాడలోని రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు.
కృష్ణకుమార్ గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవారు. తండ్రి మరణంతో తల్లి చూడరత్నమ్మ మనోవేదన పడటం గమనించాడు. తీర్థయాత్ర చేయాలనే ఆమె కోరిక తీర్చడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి 2018 జనవరి 14న యాత్ర ప్రారంభించారు.
తండ్రి దక్షిణామూర్తి ఇష్టంగా కొనుకున్న స్కూటర్‌పైనే తల్లీకుమారుడు ప్రయాణిస్తూ దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇన్నేళ్ళ ప్రయాణంలో వారిద్దరూ ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదని స్కూటర్ కూడా ఇబ్బందిపెట్టలేదని చెబుతున్నారు. మహా అయితే స్కూటర్ కు ఓ సారి పంచరు పడిందని కృష్ణకుమార్ నవ్వుతూ చెబుతున్నాడు. యాత్ర ప్రారంభించిన ఏడు నెలల ఏడు రోజుల్లోనూ దాదాపు 25 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. యాత్రలో భాగంగా ఎక్కడా హోటళ్ళలో బస చేయలేదని మఠాలు, ఆశ్రమాల్లోనే సేదతీరామని చెప్పారు.
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, గోవా, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, మిజోరం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల్లోని ఆలయాలను ఇప్పటివరకు దర్శించారు. వీరి గురించి తెలిసిన వారు మార్గమధ్యంలో ఎదురైతే విశ్రాంతి కోసం వారి నివాసాలకు ఆహ్వానిస్తున్నారు.
ఇక స్కూటర్ లో నిత్యావసరాలు, ఫలాలు, సేద తీరేందుకు అవసరమైన చాప, దుస్తులు ఉంచుకుంటున్నారు. స్కూటర్ ను ప్రయాణానికి ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణంగా ఉంది.
తన తల్లి గృహిణిగా చాలా కాలం వంటగదికి పరిమితం అయిందని, తండ్రి కాలం చేయడంతో ఒంటరితనంతో ఇబ్బందిపడేదని కృష్ణకుమార్ చెప్పారు. మాతృమూర్తి రుణం తీర్చుకునేందుకే తీర్థయాత్రలు చేస్తూ అమ్మను సంతోషపెడుతున్నట్లు వివరించారు.