ఆడబిడ్డ అయితే రూ. 50 వేలు… మగబిడ్డ అయితే ఆవుదూడ
దేశంలో సంతానోత్పత్తిరేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడంతో యువత శాతం తగ్గి వృద్ధుల జనాభా రానున్న రోజుల్లో పెరగనుంది.
జనాభా సమతుల్యత కోసం ప్రతీ ఒక్కరూ ఇద్దరు కంటే ఎక్కువ మందికి జన్మనివ్వాలని కోరుతున్నారు. ప్రతీ జంట ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సభల్లో కోరారు. తాజాగా ఆ పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎవరికైనా మూడో సంతానంగా ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు సాయంగా అందజేస్తానని అప్పలనాయుడు తెలిపారు. అలాగే మగబిడ్డ పుడితే ఆవుదూడను అందజేస్తానని బహిరంగ ప్రకటన చేశారు. తన పదవీకాలంతో సంబంధం లేకుండా ఈ నజరానాను కొనసాగిస్తాని వివరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ప్రసంగించిన అప్పలనాయుడు, లింగ వివక్షను రూపుమాపాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.
జన్మనిచ్చిన తల్లి, సోదరీమణులు, భార్య ఎంతో ప్రేరణ కలిగించారన్నారు. బాల్యంలో చదువుచెప్పిన ఉపాధ్యాయిని నుంచి.. తన కుమార్తె నుంచి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నానని తెలిపారు.