ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అమరావతి రాజధానిలో ఒకటి, శ్రీకాకుళంలో మరొకటి నిర్మించేందుకు ఫ్రీ ఫీజిబులిటీ పరీశీలించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. 27వ తేదీ టెక్నికల్ బిడ్లు, 29న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు.
శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ దూరంలో ఈశాన్యంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం రానుంది. సముద్ర తీరానికి సమీపంగా విమానాశ్రయం నిర్మిస్తారు. ఇందుకు అవసరమైన పరిశీలన చేయనున్నారు. ఫీజిబులిటీతోపాటు, పర్యావరణ ప్రభావం పరిశీలించాల్సి ఉంది. ప్రైవేటు రంగం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంపై కూడా పరిశీలన చేయనున్నారు. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు.
అమరావతి, శ్రీకాకుళం అంతర్జాతీయ విమానాశ్రయాలను రాబోయే 35 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తారు. రక్షణ రంగానికి చెందిన విమానాల తయారీ, నిర్వహణ సేవలు అందిస్తారు. ఈ ప్రాంతంలో ఏవియేషన్ సెక్టార్ పరిశ్రమలను ప్రోత్సహిస్తారు.