ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖాతాను పలువురు మహిళలు హ్యాండిల్ చేసారు. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఫిబ్రవరి 23న మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు ప్రధాని మోదీ, రాబోయే మహిళా దినోత్సవం నాడు తన సోషల్ మీడియా ఖాతాలను కొంతమంది స్ఫూర్తిదాయకమైన మహిళలకు అప్పగిస్తానని చెప్పారు. వారు తమ పని గురించి, సమాజంలో తమ అనుభవాల గురించీ దేశ ప్రజలకు వివరించడానికి తన ఎకౌంట్స్‌ను వాడతారని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ మోదీ ఎక్స్ ఖాతా ద్వారా వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులైన మహిళలు ప్రజలను పలకరించారు.
చదరంగ క్రీడాకారిణి వైశాలి రమేష్‌బాబు, న్యూక్లియర్ సైంటిస్ట్ ఎలీనా మిశ్రా, స్పేస్ సైంటిస్ట్ శిల్పీ సోనీ, బిహారీ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్త అనితాదేవి, ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’ వ్యవస్థాపక సీఈఓ అజైతా షా, దివ్యాంగ మహిళల సాధికారత కోసం పనిచేస్తున్న ‘సామర్థ్యమ్’ వ్యవస్థాపకురాలు డా.అంజలీ అగర్వాల్ తమ మనసులోని మాటలను ప్రజలతో పంచుకున్నారు.

వాటన్నింటి సారాంశాన్నీ చెబుతూ నరేంద్రమోదీ చివరిగా ఇలా ట్వీట్ చేసారు. ‘‘ఈ ఉదయం నుంచీ ఈ అసాధారణ మహిళలు తమ ప్రస్థాన గాధలను పంచుతూ మిగతా మహిళలకు స్ఫూర్తిని అందించడాన్ని మీరంతా చూసారు. ఈ మహిళలు భారతదేశపు వివిధ ప్రాంతాలకు చెందినవారు, వేర్వేరు రంగాల్లో ప్రతిభ చాటిన వారు. కానీ అందరిలోనూ ఉమ్మడిగా ఒక లక్షణం ఉంది.. అదే భారతదేశపు నారీశక్తి పరాక్రమం. వాళ్ళ నిర్ణయాలు తీసుకునే శక్తి, వారి విజయాలూ మనకు మహిళల్లో ఉండే అనంతమైన సామర్థ్యాన్ని గుర్తు చేస్తాయి. వికసిత భారతదేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో వారు అందించిన సేవలను ఇవాళా, ప్రతీ రోజూ మనం వేడుక చేసుకుందాం.’’
భారతీయ గ్రామీణ మహిళలు టెక్నాలజీని, ఎఐని వాడుకుని పారిశ్రామిక అవకాశాలను సమర్థంగా అందిపుచ్చుకునేందుకు మేరీ సహేలీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని మోదీ చెప్పారు.