కర్ణాటకలో విదేశీ యాత్రీకులపై దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. విదేశీ, స్వదేశీ పర్యాటకుల్లో మగ వారిని తుంగభద్ర కాలువలోకి నెట్టి, మహిళా విదేశీ పర్యాటకురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షల తరవాత అత్యాచారంపై మరింత స్పష్టత రానుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
కర్ణాటకలోని కొప్పళ్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు విదేశీ యాత్రికులు, ఇద్దరు స్వదేశీ యాత్రికులు కొప్పళ్ జిల్లా సానాపూర్ తుంగభద్ర కాలువగట్టు సమీపంలోని రంగమ్మ దేవాలయం వద్ద బస చేశారు. రాత్రి బైకుపై వచ్చిన ముగ్గురు ఉన్మాదులు వారిని పెట్రోల్ కోసం వంద ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు తిరస్కరించడంతో వారిలో మగవారిని సమీపంలోని తుంగభద్ర కాలువలోకి నెట్టారు. వారిలో ఇద్దరు ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఒడిషాకు చెందిన బిబాష్ నీటిలో కొట్టుకుపోయారు. అతని కోసం గాలింపు చేపట్టారు. అతని మృతదేహాన్ని తుంగభద్ర కాలువలో గుర్తించినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
విదేశీ పర్యాటకులు, స్వదేశీ పర్యాటకులపై దాడి, అత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశీ పర్యాటకురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్య పరీక్షల తరవాత మరింత స్పష్టత రావాల్సి ఉంది. నిందితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు.