ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లోని శ్రీ వేంకటేశ్వరస్వామిలో ఆలయంలో లోక క్షేమం కోరుతూ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాన్నారు.
శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తి చేయడంలో భాగంగా కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్న టీటీడీ ఈవో, అమరావతిలో శ్రీనివాసకల్యాణం నిర్వహించాలని ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. అమరావతిలో నిర్వహించే కళ్యాణాన్ని వీక్షించేందుకు 20వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు.
శ్రీవారి కళ్యాణం మార్చి 15న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.