ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ముస్లిం సంతుష్టీకరణ విధానాలకు రాయచోటిలో గత మంగళవారం జరిగిన సంఘటనే నిదర్శనం. హిందువుల ఆచారాలు, సంప్రదాయాలపై ముస్లిములు దాడులు చేస్తుంటే అడ్డుకోవలసిన పోలీసు యంత్రాంగం దాడులకు పాల్పడిన వారి కొమ్ము కాసారు. రక్షణ కోరిన హిందువుల మీదనే కేసులు పెట్టారు. పోలీసుల వైఖరిపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, అసలైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేసింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2025 మార్చి 4న వీరభద్ర స్వామి ఆలయం పారువేట ఉత్సవంలో భాగంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. ఆ సందర్భంగా పోలీసులు ముస్లిములను అదుపు చేయడంలో విఫలమయ్యారు. హిందూ భక్తులపైన మాత్రం లాఠీచార్జి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రతీ యేడాదిలానే ఈ సంవత్సరం కూడా హిందువులు ఉత్సవం జరుపుకుంటుంటే ముస్లిములు దాడి చేయడం, దానికి పోలీసులు భద్రత కల్పించకపోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించింది.
రాయచోటిలో ఉత్సవ నిర్వహణకు హిందువులు ముందస్తుగానే అన్ని అనుమతులూ తీసుకొన్నారు. అందువల్ల ఆ ఉత్సవానికి ఆటంకాలు కలగకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. వారు ఆ పని చేయకుండా, తమ ఉత్సవాలు తాము ప్రశాంతంగా నిర్వహించుకుంటున్న హిందువులను, హిందూ సంస్థలనే ఆ దాడికి బాధ్యులను చేస్తూ కేసులు పెట్టారు. ఆ చర్యను విహెచ్పి తీవ్రంగా ఖండించింది.
హిందువులపైన, వారి ఉత్సవాలపైన ముస్లిములు దాడులు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. 2024లో చిత్తూరు జిల్లా వి.కోటలో, కృష్ణా జిల్లా పెడనలోనూ హిందువుల మీద, వారి ఉత్సవాల మీదా ముస్లింలు దాడులు చేసారు. మందబలంతో విరుచుకుపడిన ముస్లిములు కేవలం హిందువుల పైనే కాకుండా పోలీసుల పైన, పోలీస్ స్టేషన్ల పైన కూడా దాడులు చేసారు. అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించారు. దాడులు చేసిన వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోగా, దాడులు జరిగిన ప్రతిసారీ హిందువులనే బాధ్యులు చేస్తుండడాన్ని విశ్వ హిందూ పరిషత్ పోలీసుల వైఫల్యంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది.
వీరభద్రుడి ఊరేగింపు సందర్భంలో రాయచోటి అర్బన్ స్టేషన్ ఎస్సై జె. నరసింహారెడ్డి హిందువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని విహెచ్పి ఆరోపించింది. హిందువులను, హిందూ సంస్థలను కించపరిచే విధంగా పోలీసులు కేసులు పెడుతుంటే, వారి వైఖరిని హిందువులు అనుమానించాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు, భక్తులను దూషించడమే కాకుండా, వారిపై లాఠీచార్జి చేసి తీవ్రంగా కొట్టారు. ముస్లిములు ఒక పథకం ప్రకారం హిందువులపైనే మళ్ళీ దాడి చేసి హిందువులను, హిందూ సంస్థలను కేసుల్లో ఇరికించే కుట్ర చేసారు. అది ముస్లిములను సంతృప్తి పరచడం కోసం చేసిన పక్షపాత చర్యగా విశ్వహిందూ పరిషత్ పరిగణించింది. ఎస్సై జె నరసింహారెడ్డి కేసు పెట్టిన తీరును, కేసులో వారు ప్రస్తావిస్తున్న అంశాలనూ పరిశీలిస్తే అది ముందస్తు పథకంతో, ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అయి ఉండవచ్చునని సంస్థ భావిస్తోంది. ముస్లిములను వెనకేసుకు వస్తూ హిందువులను అణచివేసిన ఎస్సైని వెంటనే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.
కృష్ణా జిల్లా పెడనలో పోలీసులపైనే దాడులు చేసి, వారిని గాయాలపాలు చేసినప్పటికీ ముస్లిములపై కనీస చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేకపోయింది. ఆ దాడి గురించి వాట్సాప్లో సమాచారం పెట్టారంటూ హిందువులపైనే కేసులు బనాయించే ప్రయత్నం చేసిన పోలీసుల తీరును హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. చిత్తూరు జిల్లా వి కోటలో కూడా దాడికి గురైన హిందువులనే దోషులుగా నిర్ధారించేసి వారిపై కేసులు నమోదు చేసారు. అదే సందర్భంలో నెల్లూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి, గుంటూరులో పోలీస్ స్టేషన్ తగలబెట్టిన ముస్లిములపై కేసులు నమోదు చేయకపోవడం, పెట్టిన కేసులను సైతం వెనక్కు తీసుకోవడాన్ని పోలీసుల పక్షపాత ధోరణికి ఉదాహరణలుగా విహెచ్పి భావిస్తోంది.
హిందువుల ఉత్సవాలు, ఊరేగింపుల వేళ ముస్లిములు హిందువులపై దాడులకు పాల్పడతారనే భయంతో హిందువుల ఉత్సవాలపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు పెంచడాన్ని విహెచ్పి ఖండించింది. తాజాగా రాయచోటిలో హిందువులు ఏ నినాదాలు చేయాలి, ఉత్సవంలో ఎవరు పాల్గొనాలి అని పోలీసులే పేర్కొనడం నియమాలకు విరుద్ధం. పెడనలో చుట్టుపక్కల గ్రామాల నుంచి దాడి చేయడానికి వచ్చినప్పుడు స్పందించని పోలీసులు, రాయచోటిలో భగవంతుని ఉత్సవం కోసం పరిసర గ్రామాలనుంచి భక్తులు రావడాన్ని పోలీసులు తప్పుపట్టడం వారి అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు జరిగిన ప్రతీసారీ హిందువులనే బాధ్యులుగా చేస్తూ, కేసులు నమోదు చేస్తే ఇక హిందూ సమాజం ఎంత మాత్రమూ సహించబోదని హెచ్చరించింది.
పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నప్పటికీ పోలీసులు ఉత్సవానికి భద్రత కల్పించకపోవడాన్ని విహెచ్పి తప్పుపట్టింది. పైపెచ్చు బాధిత హిందువులపైనే తప్పుడు కేసులు పెట్టిన సబ్ ఇనస్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, హిందువులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద సంఖ్యలో హిందువులందరూ పాల్గొని నిరసన ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికీ మెమొరాండం సమర్పించాలనీ యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది.