నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాబోయే 3 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు ఫోటో, గుర్తింపు సంఖ్య, ఎపిక్ కార్డులపై సాంకేతిక నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక నుంచి ఎపిక్ నెంబరు ఆధారంగా ఒక వ్యక్తి ఒకే బూత్‌లో మాత్రమే ఓటు వేసే అవకాశముంటుందని ఈసీ స్పష్టం చేసింది.
ఓటరు లిస్టులను మరింత కట్టుదిట్టంగా తయారు చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఒక్కో బూత్ నుంచి ఒక్కో పార్టీ తరపున ఒక ఏజెంట్ ద్వారా అభ్యర్థనలు తెలియజేయవచ్చని తెలిపింది. ముందుగా జిల్లా మెజిస్ట్రేటు, జిల్లా ఎన్నికల అధికారికి ఆ తరవాత రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు సమస్యలు ఉంటే తెలియజేయవచ్చని ఈసీ వెల్లడించింది.