ముంబై ఉగ్రదాడి నేరస్తుడు తహవుర్ రాణా తనను భారతదేశానికి పంపవద్దని పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత్‌కు వెడితే అక్కడ తనను చిత్రహింసలు పెడతారంటూ తహవుర్ రాణా అత్యవసర పిటిషన్ దాఖలు చేసాడు. ఆ పిటిషన్‌ను అగ్రరాజ్య న్యాయస్థానం త్రోసిపుచ్చింది.
26/11 ముంబై మహానగరంపై ఉగ్రవాదుల దాడుల సూత్రధారి తహవుర్ రాణా. అతను పాకిస్తాన్‌కు చెందిన కెనడా దేశస్తుడు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలని భారతదేశం కొంతకాలంగా పోరాడుతోంది. దాన్ని సవాల్ చేస్తూ తహవుర్ అమెరికాలోని అన్నిరకాల ఫెడరల్ న్యాయస్థానాలనూ ఆశ్రయించాడు. అయితే ఎక్కడా ఫలితం తహవుర్‌కు అనుకూలంగా రాలేదు.
తహవుర్ రాణా 2024 నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసాడు. దాన్ని కొట్టేయాలని కోరుతూ అమెరికా ప్రభుత్వం 20పేజీల నోటిఫికేషన్ దాఖలు చేసింది. ఆ నోటిఫికేషన్‌కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా తహవుర్‌ను భారత్ పంపించేందుకు మార్గం సుగమమైంది.