తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వద్ద ప్రజా సంబంధాల అధికారినని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిటిడి అధికారిక వెబ్‌సైట్ మినహా మరే ఇతర వెబ్‌సైట్లనూ, దళారీలను నమ్మి మోసపోవద్దని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసారు.
ఫరూక్ అనే వ్యక్తి ప్రసాద్ అనే నకిలీ పేరుతో తాను టీటీడీ చైర్మన్ పీఆర్‌ఓ అని చెప్పుకుంటున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామి సేవా టికెట్లు, దర్శనం టికెట్లు తీసి ఇస్తానని చెబుతూ భక్తులను మోసం చేస్తున్నాడు. ఫరూక్ చేతిలో మోసపోయిన బాధిత భక్తుడు ఒకరు ఆ విషయాన్ని ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళారు. చైర్మన్ ఆదేశంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుమల టూటౌన్ పోలీసులు నిందితుడిపై పలు కొత్త సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. నిందితుడి నుంచి 80వేల నగదు, 6 సిమ్ కార్డ్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ సందర్భంగా పోలీసు శాఖ టీటీడీ అధికారిక వెబ్ సైట్ మినహా మరే ఇతర వెబ్ సైట్ లను , దళారీలను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.