వైఎస్ఆర్‌సిపి నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అనుచరులకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పాలడుగు శ్రీను, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను అనే ముగ్గురు వ్యక్తులకు 41ఎ నోటీసులు అందజేసారు. నిందితులు ముగ్గురూ వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
నిందితులు ముగ్గురూ గతంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారనీ, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనీ ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు సంఘటనలకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ విశ్రాంత ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జాయింట్ కలెక్టర్ మాధవీలత మీద కేసు నమోదయింది. వారితో పాటు ఈ నిందితుల మీద కూడా కేసు నమోదయింది. గతంలోనే ఏపీ హైకోర్టు ఈ నిందితులకు 41ఎ నోటీసులు అందజేసి వారిని విచారించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు స్పందించిన గుడివాడ పోలీసులు ఇవాళ ఉదయమే నిందితులకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేసారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రత్యర్ధులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి అప్పట్లో తెలుగుదేశం నాయకులపై అభ్యంతరకర భాషలో దూషించిన కొడాలి నానిని టార్గెట్ చేసుకుంది. అతని వర్గంలోని వారిని కూడా వదలడం లేదు.