తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారని, ఆ ప్రక్రియను ఆపాలంటూ జాతీయ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ముందు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిటిషన్ వేశారు. తల్లి విజయమ్మకు కంపెనీలో వాటాలను గిఫ్ట్‌గా ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆ ఆస్తిపై ఉన్న కేసులు తొలగిన తరవాత ప్రక్రియ పూర్తవుతుందనే ఎంవోయూను వారు ఉల్లంఘించారని జగన్మోహన్రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా కంపెనీలో వాటాల బదిలీ చెల్లదని జగన్మోహన్రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు.
కంపెనీ బోర్డులోని ఓ డైరెక్టర్ వాటాల బదిలీ విషయం కూడా తనకు తెలియదని చెప్పాడని జగన్మోహన్రెడ్డి పిటిషన్లో వివరించారు. తల్లికి ఇచ్చిన గిఫ్ట్ వాటాల విషయంలో ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదని, వాటాలను షర్మిలకు బదిలీ చేయడం న్యాయ విరుద్ధమని కోర్టుకు తెలిపారు.
తన తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని షర్మిల కుట్రకుపాల్పడి తన ఆస్తులు కాజేసిందని పిటిషన్లో తెలిపారు. షర్మిలకు విజయమ్మ బదిలీ చేసిన షేర్లను నిలుపుదల చేయాలని కోరారు. ఈ హక్కు కంపెనీల చట్టం సెక్షన్ 59 ప్రకారం కంపెనీ లా బోర్డుకు ఉందన్నారు. వాటాల అక్రమ బదిలీలను అడ్డుకోవాలంటూ జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి, కార్మెల్ పవర్ పిటిషన్ వేశారు. తల్లి, చెల్లి గతంలో ప్రేమగా ఉండేవారని, ఇప్పుడు వారు మారిపోయారని తన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారంటూ పిటిషన్లో వివరించారు.
షర్మిల అత్యాశ వల్లే వాటాల బదిలీ జరిగిందన్నారు. షర్మిల ప్రణాళిక ప్రకారం విజయమ్మను ముందుంచి మొత్తం నడిపించిందని వివరించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాల వల్ల వారు ఆస్తులు బదిలీ చేసుకోవడంతో తనకు నష్టం వాటిల్లిందని జగన్మోహన్రెడ్డి పిటిషన్లో పేర్కొననారు. ప్రతివాదులు ఈ పిటిషన్‌కు వక్ర భాష్యం చెబుతూ ట్రైబ్యునల్ విచారణ చేయకుండా, దాన్ని కుటుంబ వివాదంగా మారుస్తున్నారని కూడా ఆరోపించారు.
జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి, కార్మెల్ పవర్ వేసిన పిటిషన్ విచారణను కంపెనీ లాబోర్డు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. అక్రమ వాటాల బదిలీని సవరించి, తనకు న్యాయం చేయాలంటూ జగన్మోహన్రెడ్డి పిటిషన్లో స్పష్టంగా వివరించారు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల