ఈ నెల 10 నుంచీ పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో వైఎస్ఆర్‌సిపికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఉభయసభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరిగింది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కాబట్టి దానిపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా, వారు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం దారుణమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్దేశించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదిలో పెరిగినంతగా దక్షిణాదిలో సీట్లు పెరగబోవన్న ప్రచారం సాగుతోందని ఎంపీలు ప్రస్తావించారు. దానిపై స్పందించిన జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారు.
‘వన్ నేషన్. వన్ ఎలక్షన్’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు గుర్తు చేసారు. దానిపై స్పందించిన జగన్.. జమిలి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని నిర్దేశించారు.
ఆ సమావేశంలో వైఎస్సార్‌సీపీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభలో వైసీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైసీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, రఘునాథరెడ్డి, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.