ప్రతీ వస్తువుకూ ‘హలాల్’ సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తోందంటూ కేంద్రప్రభుత్వం జమియాత్ ఉలేమా ఎ హింద్ హలాల్ ట్రస్ట్ మీద ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కింది. ఆ కేసు విచారణ సందర్భంలో తాము తులసి నీళ్ళను సైతం హలాల్ చేస్తామని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతేకాదు, హలాల్ ప్రక్రియ ద్వారా తాము లక్షల కోట్లు సంపాదిస్తున్నామన్న ఆరోపణ పూర్తిగా అసత్యమని, తమను అవమానించేలా ఉందనీ ఎదురు వాదించింది.
జమియాత్ ఉలేమా ఎ హింద్ హలాల్ ట్రస్ట్ వివిధ వస్తువులకు హలాల్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. సాధారణంగా ఆహార పదార్ధాలకు మాత్రమే చేసే హలాల్‌ను వస్తువులకు కూడా వర్తింపజేస్తున్నారని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. సిమెంట్, ఇనప ఊచలు, సీసాలు… అలా ఒకటేమిటి, ఉత్పత్తి జరిగి, ఎగుమతి అయ్యే ప్రతీ వస్తువుకూ హలాల్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేస్తున్నారని, దానికోసం ఆ ఉత్పత్తులు తయారుచేసే కంపెనీల నుంచి భారీగా రుసుములు వసూలు చేస్తున్నారని వివరించింది. ఆ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు 2025 జనవరి 20న అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ కేసు విచారణ సందర్భంలోనే, తులసి నీళ్ళకు సైతం హలాల్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్న సంగతి బైటపడింది.
సుప్రీంకోర్టులో హలాల్ సర్టిఫికేషన్ మీద ట్రస్ట్ ప్రతివాదన:
కేంద్రప్రభుత్వం తమపై చేసిన ఆరోపణల మీద హలాల్ ట్రస్ట్ 2025 ఫిబ్రవరి 25న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తాము సిమెంట్, ఐరన్ బార్స్‌కు ఎప్పుడూ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పింది. అంతేకాదు, ఏ ఆధారంతో కేంద్రప్రభుత్వం తమమీద అలాంటి ఆరోపణలు చేస్తోందో వివరణ ఇవ్వాలని కోరింది. ఒక సంవత్సర కాలంలో తాము సుమారు రూ.2.1కోట్లు వసూలు చేస్తామని, అందులో రూ.59.2లక్షలు పన్నుగా ప్రభుత్వానికి కడతామనీ చెప్పుకొచ్చింది. అయితే లిప్‌స్టిక్, తులసి నీళ్ళు, బిస్కెట్లు, మంచినీళ్ళ సీసాలు వంటి వాటిని హలాల్ చేయడం తప్పనిసరి అంటూ తమ చర్యను సమర్ధించుకుంది. వాటి తయారీలో జంతువుల కొవ్వు, ఎముకలు లేదా మరే ఇతర నిషిద్ధ పదార్ధాలూ వాడలేదని నిర్ధారించాల్సి ఉంటుందని హలాల్ ట్రస్ట్ వివరించింది.
ప్రభుత్వానిదే తప్పన్న హలాల్ ట్రస్ట్:
‘‘కేంద్రప్రభుత్వం ప్రకటనలు పూర్తిగా తప్పు. అవి మాకు అవమానకరం, మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్రం ప్రకటనలకు ఏ ఆధారమూ లేదు. అధికారుల ప్రకటనలూ, రికార్డులూ కేంద్రం వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. అసలు కోర్టు ముందు అలాంటి ప్రకటన చేయడానికి సొలిసిటర్ జనరల్‌కు సూచనలిచ్చిన అధికారి ఎవరో న్యాయస్థానం తెలుసుకోవాలి. వారి ప్రకటనలు హలాల్ అనే అంశానికే విఘాతం కలిగించేలా ఉన్నాయి. హలాల్ అనేది మన దేశంలో ఒక అతిపెద్ద వర్గపు జీవన విధానానికి, ప్రవర్తనకూ తప్పనిసరిగా కావలసిన కనీస మౌలిక అంశం’’ అంటూ ప్రభుత్వం తమను ప్రశ్నించడమే నేరం అన్నట్లు హలాల్ ట్రస్ట్ వాదించింది.
ఆ సందర్భంగా జరిగిన వాదనల్లో హలాల్ సర్టిఫికేషన్ కేవలం ఆహార పదార్ధాలకు మాత్రమే జరగడం లేదని, అన్ని రకాల ఉత్పత్తులకూ హలాల్ సర్టిఫికేషన్ చేస్తున్నారనీ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. చివరికి సిమెంటు, ఐరన్ బార్స్‌ను కూడా హలాల్ చేస్తున్నారని వివరించింది.
ఆ ఆరోపణలకు హలాల్ ట్రస్ట్ పరస్పర విరుద్ధమైన వాక్యాలతో జవాబిచ్చింది. ‘‘ఇనుప ఊచలకు, సిమెంటుకు ఎలాంటి హలాల్ సర్టిఫికేట్ జారీ చేయలేదు. అలాంటి ఉత్పత్తులకు సర్టిఫికెట్ జారీ చేసినట్లు ప్రభుత్వం బలమైన సాక్ష్యాన్ని చూపించగలదా? అయితే స్టీల్, సిమెంట్ కంపెనీలు తయారు చేసే కొన్ని ముఖ్యమైన వస్తువులకు హలాల్ సర్టిఫికెట్ ఉండాలి. అంటే తినే పదార్ధాలను భద్రపరచడానికి వాడే టిన్ ప్లేట్లు, ఫుడ్ క్యాన్‌లను తయారు చేసి వాటిని భారతదేశం నుంచి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు తమ లాభాల కోసం ఆ వస్తువులను ఎగుమతి చేస్తారు. ఆ వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు ఆయా వస్తువులకు హలాల్ సర్టిఫికేషన్ ఉండాలని షరతులు విధిస్తుంటాయి. అలాంటప్పుడు మాత్రమే వాటికి హలాల్ సర్టిఫికెట్ జారీ చేస్తాము’’ అని చెప్పుకొచ్చింది.
(సశేషం)