ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారుడు తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించ వద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయ ప్రక్రియ పూర్తి చేసుకుని తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంగీకారం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. తనను భారత్‌కు అప్పగిస్తే చిత్ర హింసలు పెడతారని, భారత్‌కు తనను అప్పగించకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి ప్రస్తుతం, ఇతను లాస్‌ఏంజలెస్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ తహవూర్ రాణా పెట్టుకున్న పలు పిటిషన్లను పెడరల్ కోర్టులు కొట్టివేశాయి. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అమెరికా సుప్రీంకోర్టులో తహవూర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. భారత్‌కు తహవూర్‌ను అప్పగించేందుకు రంగం సిద్దమైంది. ఈ సమయంలో మరోసారి తహవూర్ రాణా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కరుడుగట్టిన నేరస్థుడు తహవూర్ రాణాకు భారత్‌కు అప్పగిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అమెరికాలోని నేరస్థులను ఆయా దేశాలకు పంపిస్తామని ఆయన తెలిపారు.
ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి హెడ్లీకి, తహవూర్ రాణా పూర్తి సహకారం అందించాడనేది ప్రధాన అభియోగం. ఉగ్రదాడి తరవాత కెనడా పారిపోయిన రాణా, చివరకు అమెరికా పోలీసులకు చిక్కి జైళు శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబైలో ట్రావెల్స్ నిర్వహిస్తూ రెక్కీ నిర్వహించేందుకు హెడ్లీకి సహకరించాడని పోలీసులు అభియోగాలు మోపారు.
2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబై నగరంపై విరుచుకుపడ్డారు. దాదాపు 200 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. ఉగ్రదాడి తరవాత నిర్వహించిన ఆపరేషన్‌లో కొందరు ఉగ్రవాదులు హతమయ్యారు. కసబ్ పోలీసులకు సజీవంగా చిక్కాడు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు మేరకు ఎరవాడ జైల్లో కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులకు సహకరించిన తహవూర్ రాణా భారత్‌కు తరలిస్తే ఈ కేసులో మరికొంత మంతి పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఏజన్సీలు భావిస్తున్నాయి.