ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్‌సిపి సభ్యుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు నమోదయింది. జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆ పార్టీకి చెందిన నాయకుడు అడపా మాణిక్యాలరావు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఆ మేరకు పోలీసులు ఎంఎల్‌సి మీద కేసు నమోదు చేసారు.
పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణపై దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక జనసేన నాయకులు దువ్వాడ శ్రీనివాస్ మీద ఫిర్యాదులు చేసారు. వాటి ఆధారంగా మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ నాయకుడిగా కంటె దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం కారణంగా ఎక్కువ పాపులర్ అయ్యారు. వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్ అయ్యారు. ఇటీవల ఫిబ్రవరి 14 వ్యాలెంటైన్స్ డే సందర్భంగా టీవీ, యూట్యూబ్ చానెళ్ళలో సైతం వీరిద్దరి వ్యవహారమే ఎక్కువ కనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అవుతాడా అన్న విషయం ఆసక్తికరంగా నిలిచింది.