ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరంలో ఎన్‌టిఆర్ స్మారక ట్రస్ట్ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది. టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో ఈ భవనం నిర్మించనున్నారు. ఎన్‌టిఆర్ ట్రస్ట్ కార్యనిర్వాహక ధర్మకర్తగా ఉన్న నారా భువనేశ్వరి భవనానికి శంకుస్థాపన చేసారు.
హైదరాబాద్‌లో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేవలు అందించే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించే కార్యక్రమాన్ని ట్రస్ట్ చేపట్టింది. ఈ భవనంలోనే తలసీమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.