వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందంటూ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తోన్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. నియోజకవర్గాల పునర్విభజన ఊహాజనితమైనది అన్నారు. సందర్భం వచ్చినప్పుడు దానిపై స్పందిస్తా మంటూ ఢిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
జనాభాను పెంచాలంటూ దేశంలో తానే మొదటిసారి పిలుపునిచ్చానని గుర్తుచేశారు. దేశంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఏపీలో తల్లికివందనం పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. జనాభా తగ్గిపోవడంతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని గుర్తుచేశారు. దేశంలో జనాభాను పెంచేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. దేశ మనుగడ కోసం జనాభాను పెంచాలన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవన్నారు.
జనాభా తగ్గిపోవడం వల్ల లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనను చంద్రబాబునాయుడు తోసిపుచ్చారు. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుందన్నారు. జనాభాను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. ఇందుకు కేంద్రం సహకరించాలన్నారు.
దేశంలో ఎన్ని భాషలను ప్రోత్సహించినా తప్పులేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏపీలో మాతృభాషను ప్రోత్సహిస్తూనే, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్‌ను నేర్పిస్తున్నామన్నారు. జాతీయ భాషగా హిందీ నేర్చుకోవాలన్నారు. మాతృ భాషలో ప్రాధమిక విద్యావిధానం ఉండాలన్నారు. గత ప్రభుత్వం మాతృభాష లేకుండా చేయాలని చూచిందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్శిటీల్లో పది విదేశీ భాషలను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వారు విదేశీ భాషలు నేర్చుకున్న తరవాత ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి ఐఏఎస్‌లు ఎక్కువగా వచ్చేవారని, ప్రస్తుతం వారు విదేశాల్లో ఉద్యోగాలకు వెళుతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఐఏఎస్‌లు ఎక్కువగా వస్తున్నారని, రాబోయే రోజుల్లో వారు విదేశాలకు వెళతారని చెప్పారు. త్రిభాషా విధానం వల్ల ఇబ్బందులు లేవన్నారు. స్థానిక భాషగా మాతృభాష, జాతీయ భాషగా హిందీ, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ఉంటుందన్నారు.