సినీ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె కుమార్తె దయ అన్నారు. తన తల్లిది ఆత్మహత్యా ప్రయత్నం కాదని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ళుగా ఇన్‌సోమ్నియాతో బాధపడుతున్న తన తల్లి, వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారని, నిన్న ఆ మందులు ఓవర్‌డోస్ అయ్యాయనీ వివరించారు.
కల్పన కేవలం గాయని కాదని, ఆమె ప్రస్తుతం ఎల్ఎల్‌బి, పిహెచ్‌డి చేస్తున్నారని కుమార్తె దయ చెప్పారు. కల్పన ఈమధ్య ఇన్‌సోమ్నియాకు మందులు వాడుతున్నారని, నిన్న ఆ మందులను కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నారనీ వివరించారు. కల్పన ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని, ఒత్తిడిలో మందులు కొంచెం ఓవర్‌డోస్ అయ్యాయనీ చెప్పారు.
తమ కుటుంబం అంతా ప్రశాంతంగా జీవిస్తున్నామని దయ చెప్పారు. తన తల్లి, తండ్రి ఆనందంగా కలిసి ఉన్నారని వివరించారు. ఒకట్రెండు రోజుల్లో కల్పన మళ్ళీ సాధారణ స్థితికి వస్తుందని దయ వివరించారు.