ఫాల్గుణ శుక్ల పక్ష షష్ఠి సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఉదయం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆ ఉత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
సుబ్రహ్మణ్య స్వామి కారణజన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. ఆది దంపతుల తనయుడు, దేవగణానికి సర్వసేనాధిపతి. మానవ శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యుడే అధిదైవతం. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునికి, రాహువుకు అధిష్ఠాన దేవత. కుజుడు మానవులకు శక్తిని , ధనాన్ని, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే మానవులకు కుజ అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కాబట్టి, సర్పగ్రహాలైన రాహుకేతువులు ఆ స్వామి అధీనంలో ఉంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనను రాహు కేతు దోషాలకు పరిహారంగా భావిస్తారు.
ఫాల్గుణ శుక్ల షష్ఠి నాడు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వలన అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, పుత్రార్థులకు సత్సంతానం కలుగుతుందనీ, వంశాభివృద్ధి జరుగుతుందనీ భక్తుల విశ్వాసం.