ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా లో హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నాడన్న ఆరోపణలపై హరీష్ సింగ్ అనే వ్యక్తిపై ఇకోనా పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక చట్టం సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. హరీష్ సింగ్ మార్చి 2న ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసాడు. సామాజికంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల వారిని కూడగట్టాడు. వారిని క్రైస్తవంలోకి మతం మార్చడానికి ప్రయత్నించాడని స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి.
విశ్వహిందూ పరిషత్, విశ్వహిందూ మహాసంఘ్ వంటి హిందూ సంస్థలు ఆ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించాయి. శ్రావస్తి జిల్లా భగవాన్‌పూర్ బంకట్ గ్రామంలో జరిగిన ప్రార్థనా కూటమి విషయమై ఫిర్యాదు చేయడంతో హరీష్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
భగవాన్‌పూర్ బంకట్ గ్రామంలో హరీష్ సింగ్ ఒక తాత్కాలిక గుడిసె ఏర్పాటు చేసుకున్నాడని, ప్రతీ ఆదివారం అక్కడ ప్రార్థన కూటముల పేరిట క్రైస్తవ మత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనీ గ్రామస్తులు తెలియజేసారు. శ్రావస్తి జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న బలరాంపూర్, బహ్రయిచ్, గోండా జిల్లాల నుంచి కూడా వ్యక్తులను ఆ కూటములకు తీసుకొస్తున్నాడని వివరించారు. సాధారణంగా హిందూ మతస్తులను ఎక్కువమందిని ఆ కూటములకు తెస్తున్నారనీ, వారిని బైబిల్ చదివేలా, క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారనీ వెల్లడించారు. కొన్నాళ్ళకు వారిని క్రైస్తవమతంలోకి మారుస్తున్నారని తెలియజేసారు.