కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు, మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్, అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ మోసం చేయడం తప్ప ఏమీ లేదన్నారు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఊదరగొట్టి ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది మాత్రం బోడి సున్నా అని ఎద్దేవా చేశారు.
అధికారమిస్తే 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేల నిరుద్యోగ భృతి అని వాగ్దానం చేసి రెండు బడ్జెట్‌లలోనూ నిధులు కేటాయించలేదని దెప్పిపొడిచారు. ‘ఆత్మస్తుతి-పరనింద’ అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ఉందని విమర్శించారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.