ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మరోసారి స్పందించారు. కుంభమేళా నిర్వహణతో యూపీ లో జరిగిన సంపదసృష్టి గురించి ఉదాహరణతో వివరించారు. కుంభమేళాలో పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే సమాజ్ వాదీ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు.
శాసనభ వేదికగా సమాజ్ వాదీ పార్టీ విమర్శలను తిప్పికొట్టిన సీఎం యోగీ, పడవలు నడిపే ఓ కుటుంబం కుంభమేళా సమయంలో సుమారు రూ. 30 కోట్లు ఆర్జించిందని విజయగాథను వివరించారు. ఓ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని 45 రోజుల కుంభమేళాలో పడవలు నడపడం ద్వారా ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాలు తెచ్చిందన్నారు. రోజుకు ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చిందని లెక్కలతో వివరించారు.
ఒక్క తొక్కిసలాట ఘటన మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. ఎలాంటి నేరం జరగలేదు అని అన్నారు.
కుంభమేళా కోసం ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 200కుపైగా రోడ్లు విస్తరణ, 14 ఫ్లైఓవర్లు,9 అండర్‌పాస్‌లు నిర్మించినట్లు తెలిపారు.దీంతో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. హోటల్ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరగడంతో పాటు రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు.