అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్‌ని ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. పదవి చేపట్టిన ఆరు వారాల్లో తాను చేసిన పనుల గురించి, సాధించిన విజయాల గురించీ చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని తెలిజేసారు.
చాలా దేశాలు దశాబ్దాల తరబడి అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయి. ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. భారతదేశమైతే అమెరికా మీద నూరు శాతం ఆటో టారిఫ్‌లు విధించింది. ఆ విధంగా అమెరికా చాల నష్టపోతోంది. అందుకే ఈ యేడాది ఏప్రిల్ 2 నుంచి అలాంటి దేశాల మీద అమెరికా కూడా ప్రతీకార సుంకాలు విధిస్తుంది. వాళ్ళు ఎంత టారిఫ్ వేస్తే మేమూ అంతే టారిఫ్ వసూలు చేస్తాం. అమెరికాను మళ్ళీ ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబెట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
అధ్యక్ష ప్రసంగానికి డోజ్ అధినేత ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ – ప్రభుత్వ సమర్ధత విభాగం తరఫున ఎలాన్ మస్క్ గొప్పగా పనిచేస్తున్నారంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆ సమయంలో రిపబ్లికన్ పార్టీ సభ్యులు కరతాళ ధ్వనులు చేసారు.
అధ్యక్షుడి భార్య మెలానియా కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో అశ్లీలతను అడ్డుకునే బిల్లును తీసుకు రావడంలో మెలానియా చాలా కృషి చేసారంటూ ట్రంప్ తన భార్యకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సందర్భంగా మెలానియా ట్రంప్‌కు కాంగ్రెస్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.