రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్‌రేప్, బ్లాక్‌మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల పేర్లు అష్రఫ్ అలీ, షోయబ్ షేక్, సాన్విర్ మొహమ్మద్ నీల్గార్, షారుఖ్ ఖాన్ అలియాస్ బబ్లూ రంగ్రేజ్, ఖాలిద్ అలియాస్ దుల్హా, ఆమిర్ ఖాన్ పఠాన్, సోయబ్‌నూర్ మొహమ్మద్ మాన్సురీ, ఫైజాన్ ఘోరీ మాన్సురీ. పోలీసులు వారిని విచారిస్తున్నారు, ఈ కేసులో సంబంధమున్న మరికొంతమంది గురించి వెదుకుతున్నారు.
బాధిత మహిళ మార్చి 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. బాధితురాలు గతేడాది మార్చిలో అష్రఫ్ అలీ అనే స్నేహితుణ్ణి కలవడానికి బద్లా చౌరాహా ప్రాంతంలోని ఒక కెఫేకు వెళ్ళింది. అక్కడ అష్రఫ్‌తో పాటు బబ్లూ కూడా ఉన్నాడు. బబ్లూ ఆమెకు కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దాని ప్రభావంతో స్పృహ కోల్పోయిన ఆ మహిళను అష్రఫ్ కెఫే లోపలి ఒక గదిలోకి తీసుకువెళ్ళి రేప్ చేసాడు. ఆ సమయంలో బబ్లూ కాపలాగా ఉన్నాడు. అష్రఫ్ ఆ మహిళను అశ్లీలంగా ఫొటోలు, వీడియోలు తీసాడు. వాటి సాయంతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు రేప్ చేసాడు. ఆ ఫొటోలు, వీడియోలను అష్రఫ్ తన స్నేహితులకు కూడా షేర్ చేసాడు. వారు కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి రేప్ చేసారు. దాదాపు యేడాది నుంచీ ఈ గ్యాంగ్‌రేప్‌లు జరుగుతూనే ఉన్నాయి.
నిందితులు అక్కడితో ఆగలేదు. మరికొందరు మహిళలను తమకు పరిచయం చేయాలంటూ బాధిత మహిళను ఆమిర్, షోయబ్ బెదిరించడం మొదలుపెట్టారు. వారు బాధితురాలి సోషల్ మీడియా అకౌంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ యేడాది జనవరి 1న సాన్వీర్ బాధితురాలిని బైటకు పిలిచి ఆమెతో అసహజ రతికి పాల్పడ్డాడు. ఇంక ఈ నెల 1న ఆమిర్ బాధితురాలిని శివాజీ పార్క్‌కు రమ్మని పిలిచాడు. అక్కడకు వచ్చిన ఆమెతో తనకు మరికొందరు మహిళలను పరిచయం చేయాలంటూ ఒత్తిడి చేసాడు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమిర్ చర్యలను అడ్డుకునే ప్రయత్నంలో బాధితురాలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవారు పోగయ్యారు. అదే అదనుగా అక్కడినుంచి తప్పించుకున్న ఆమె, ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యులకు గత యేడాది కాలంగా తను అనుభవిస్తున్న నరకం గురించి మొత్తం చెప్పింది.
తర్వాత కుటుంబ సభ్యుల సహాయంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. భిల్వారా జిల్లా ఎస్‌పి ధర్మేంద్ర యాదవ్ ఈ కేసు దర్యాప్తును భిల్వారా డిఎస్‌పి మనీష్ బడాగుర్జర్‌కు అప్పగించారు.