ఔరంగాబాద్ పేరు శంభాజీ మహరాజ్ గా మార్చాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. ఔరంగజేబ్ ను ఆరాధించే వారు ఆయన సమాధిని వారింట్లో పెట్టుకోవాలని హితవు పలికారు. ఔరంగజేబ్‌ను పొగుడుతూ సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరాఠనేలను ఛత్రపతి శివాజీ మహరాజ్, శంభాజీ మహరాజ్ పాలించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. అబు అజ్మీ లాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు తప్పకుండా ‘ఛావా ’ సినిమా చూడాలని సూచించారు. శంభాజీ పట్ల ఔరంగజేబ్ ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తెలుస్తుందని మండిపడ్డారు.
ఔరంగజేబ్ క్రూరుడు కాదని, ఆయన ఎన్నో ఆలయాలు కట్టించాడని అబు అజ్మీ అన్నారు. ఈ వ్యాఖ్యలను నవనీత్ రాణాతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తప్పుపట్టారు. అబూ అజ్మీ క్షమాపణలు చెప్పాలన్నారు. తీరు మార్చుకోకపోతే ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబ్ 40 రోజులు బంధించి చిత్రహింసలు పెట్టాడన్నారు.