రిలయన్స్ సంస్థ గుజరాత్‌లో నిర్వహిస్తున్న ‘వనతార’ పునరావాస, పరిరక్షణ కేంద్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణులకు చికిత్స అందించడం, వాటి పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ‘వనతార’ను నిర్వహిస్తున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కలల ప్రాజెక్టు అయిన ‘వనతార’ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం జామ్‌నగర్ దగ్గరున్న ‘వనతార’ కేంద్రంలో విహరించారు. అక్కడ వన్యప్రాణులను చికిత్స అందిస్తున్న వైద్యకేంద్రాన్ని పరిశీలించారు. ఆయనకు ముకేశ్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానం పలికారు. తర్వాత అనంత్ అంబానీ దగ్గరుండి ప్రధానమంత్రిని వనతార కేంద్రం అంతా చూపించారు. అక్కడ ప్రధానమంత్రి వన్యప్రాణులతో ఆహ్లాదంగా గడిపారు. కొన్ని జీవులకు ఆహారం అందించారు. అంతే కాదు, ప్రధాని మోదీ వనతారలో తను చూసిన విశేషాలను గురించి ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
‘‘వనతారలో నేను యాసిడ్ దాడికి గురైన ఏనుగును చూసాను. దానికి చాలా జాగ్రత్తగా వైద్యం అందిస్తున్నారు. మావటి నిర్లక్ష్యం వల్ల దృష్టిని కోల్పోయిన ఏనుగులు కొన్ని ఉన్నాయి. వేగంగా వస్తున్న ట్రక్కు గుద్దేయడంతో ఒక ఏనుగు గాయాల పాలయింది. వాటిని చూసినప్పుడు ఒక ప్రశ్న కలుగుతుంది. మనుషులు అంత నిర్లక్ష్యంగా, క్రూరంగా ఎలా ఉండగలరు? అలాంటి బాధ్యతా రాహిత్యానికి స్వస్తి పలుకుదాం. జంతువులపై దయ చూపిద్దాం’’ అంటూ ప్రధాని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
‘‘ఒక వాహనం ఢీకొనడంతో ఒక సివంగి వెన్నెముకకు గాయాలయ్యాయి. దానికి ఇక్కడ తగిన చికిత్స అందుతోంది. కుటుంబానికి దూరమైన ఒక చిరుతపులి పిల్లకు ఇక్కడ సంరక్షణ లభిస్తోంది. అలాంటి ఎన్నో జంతువుల పరిరక్షణ బాధ్యతలు చేపట్టిన వనతార బృందాన్ని అభినందిస్తున్నాను’’ అంటూ మోదీ వారి సేవలను కొనియాడారు.