ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ నెల మొదలైంది. ఈ నెలరోజులూ సుదీర్ఘ సమయం ఉపవాసాలూ, తెల్లవారుజామున వివిధ మాంసాహార వంటకాలతో విందులూ ఆరగించడం వారికి పరిపాటి. లౌకికవాద భారతదేశంలో అన్ని మతాలకూ సమదూరం పాటించాలని చెప్పే నీతిసూత్రాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమని ఇఫ్తార్ విందులు నిరూపిస్తాయి. ముఖ్యంగా, విద్యాసంస్థల్లో హిందువుల విషయంలో లౌకికవాదాన్ని కట్టుదిట్టంగా పాటించే యాజమాన్యాలు, రంజాన్ నెల వచ్చేసరికి ముస్లిముల అడుగులకు మడుగులొత్తుతాయి. ఇటీవలి కాలంలో అలాంటి కొన్ని సంఘటనలను ఒక్కసారి చూద్దాం.
2025 ఫిబ్రవరి 9: మహారాష్ట్ర ముంబైలోని ఐఐటీ బొంబాయి హ్యుమానిటీస్ విభాగంలో రంజాన్ మాసం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ముస్లిములు ‘సెహరి’ సమయంలో, అంటే తెల్లవారు జామున భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఆ అవకాశాన్ని వాడుకోదలచుకున్న వారు తమ వివరాలను ఒక గూగుల్ ఫామ్‌లో నింపాలనీ విద్యార్ధులకు ఒక ఇ-మెయిల్ పంపించారు.
రంజాన్ సందర్భంగా ముస్లిం విద్యార్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఐఐటీ బొంబాయి హ్యుమానిటీస్ విభాగం, గతంలో కొన్ని టేబుళ్ళను శాకాహార భోజనం చేసేవారి కోసం ప్రత్యేకంగా ఉంచమని కోరితే తిరస్కరించింది. అలా చేయడం విద్యార్ధులను విభజించినట్లవుతుందని, కులవివక్షను ప్రోత్సహించినట్లవుతుందనీ వాదించింది. చివరికి శాకాహారుల విజ్ఞప్తిని మాత్రం అంగీకరించనే లేదు. విచిత్రమేంటంటే అదే విభాగాధిపతులకు హలాల్ ఆహారం వడ్డించడానికి మాత్రం అభ్యంతరం లేదు. ఇప్పుడు రంజాన్ సందర్భంగా సెహరి భోజనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది.
2024 ఏప్రిల్ 7: ఉత్తరప్రదేశ్‌లోని మవూలో బిఎస్ఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీ యాజమాన్యం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించింది. కళాశాల ఆవరణలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కాలేజీలోని ముస్లిం విద్యార్ధులతో పాటు వందల సంఖ్యలో పరిసర ప్రాంతాల ముస్లిములు హాజరయ్యారు.
2024 ఏప్రిల్ 7: ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ సంస్థ ముస్లిం విద్యార్ధినీ విద్యార్ధుల కోసం ఇఫ్తార్ విందు నిర్వహించింది.
2024 ఏప్రిల్ 6: పంజాబ్‌లోని పటియాలాలో దేశ్ భగత్ యూనివర్సిటీ తమ విశ్వవిద్యాలయ విద్యార్ధుల కోసం ఇఫ్తార్ విందు ఇచ్చింది. విభిన్న నేపథ్యాలున్న విద్యార్ధులు అందరినీ ఒక్కతాటి మీదకు తేవడం, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడం, ఒకరి పద్ధతుల గురించి మరొకరు తెలుసుకోవడమే లక్ష్యంగా ఆ ఇప్తార్ విందు ఇచ్చినట్లు యాజమాన్యం ప్రకటించుకుంది.
2024 ఏప్రిల్ 5: పంజాబ్ భటిండాలోని గురు కాశీ విశ్వవిద్యాలయం ఫార్మాసూటికల్స్ విభాగం విద్యార్ధులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. మతసామరస్యం, కలిసిమెలిసి ఉండడమే లక్ష్యంగా ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు వారు చెప్పుకొచ్చారు.
2024 మార్చి 28: పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మత సామరస్య సందేశాన్ని చాటిచెప్పడం అనే పేరుతో ఇఫ్తార్ విందు జరుపుకున్నారు. యూనివర్సిటీలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో 300మందికి పైగా వివిధ వర్గాలకు చెందిన వారు ఆ విందులో పాల్గొన్నారు. అదే విశ్వవిద్యాలయంలో అంతకు ముందే సరస్వతీ పూజ జరుపుకోనివ్వకుండా అడ్డుకున్నారు. అలాగే 2024 జనవరిలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కొందరు విద్యార్ధులు వేడుకలు జరుపుకొంటుంటే వారిపై దాడి చేసారు.
2024 మార్చి 28: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎమరాల్డ్ హైస్కూల్లో భారీఎత్తున రోజా ఇఫ్తార్ విందు నిర్వహించారు. పాఠశాలలో ఇఫ్తార్ విందు జరిగిన దృశ్యాలు తర్వాత సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆ మొత్తం వ్యవహారం మీద పాఠశాల యాజమాన్యం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేసాయి.
2023 ఏప్రిల్ 23: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులు ఇఫ్తార్ విందులు నిర్వహించారు. ముస్లిం-ముస్లిమేతర విద్యార్ధుల మధ్య సోదర భావాన్ని పెంచడం పేరుతో ఆ కార్యక్రమాలు చేపట్టారు. సహజంగానే, ఆ ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నవారిలో ఎక్కువ సంఖ్యలో ముస్లిమేతరులే ఉన్నారు.
2023 ఏప్రిల్ 18: జమ్మూలోని జమ్మూ విశ్వవిద్యాలయంలో ఇఫ్తార్ విందు జరిగింది,
2023 ఏప్రిల్ 12: కశ్మీర్‌లోని బాబా గులామ్షా బాద్షా యూనివర్సిటీలో టీచర్స్ అసోసియేషన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఇఫ్తార్ పార్టీ జరుపుకుంది.
2023 ఏప్రిల్ 6: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో హిందూ విద్యార్ధులు తమ తోటి ముస్లిం విద్యార్ధులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సుమారు 700 మంది విద్యార్ధులు ఆ విందులో పాల్గొన్నారు.
2022 ఏప్రిల్ 30: బిహార్ దర్భంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దానికి ముందు నమాజ్ చేసారు. ఆ కార్యక్రమానికి ఆర్జేడీ, జేడీయూ పార్టీల నాయకులు సైతం హాజరయ్యారు.
2022 ఏప్రిల్ 28: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇఫ్తార్ విందు జరిగింది. జైన విద్యార్ధులు విందునివ్వడం, దానికి ముస్లిం విద్యార్ధులు, వర్సిటీ అధ్యాపకులు హాజరవడం విచిత్రం. అయితే బీహెచ్‌యూలో అలా ఇఫ్తార్ విందులు ఇచ్చే పద్ధతి గతంలో ఎప్పుడూ లేదంటూ ఏబీవీపీ విద్యార్ధులు ఆ కార్యక్రమానికి తమ నిరసన తెలియజేసారు.
హిందూ విద్యార్ధులు తమ ఆచార సంప్రదాయాలు పాటించుకుంటే యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకుంటున్న సంఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. ఏదైనా భగవంతుడికి చెందిన దీక్ష తీసుకుంటేనో, మాల ధారణ చేస్తేనో ఆ దీక్షకు సంబంధించిన దుస్తులు ధరించడానికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భాలు తరచుగా చూస్తున్నాం. మరోవైపు విద్యాసంస్థల్లో ఇఫ్తార్ విందులు ఇవ్వడం మాత్రం మత సామరస్యం పేరిట చెల్లుబాటైపోతోంది.