అమెరికా, చైనా ట్రేడ్ వార్ పరాకాష్ఠకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే చైనా, కెనడా,మెక్సికో దేశాల దిగుమతులపై సుంకాలను 15 నుంచి 25 శాతం పెంచారు. దీంతో ఇప్పుడు ఆయా దేశాలు అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేశాయి. చైనా ముందుగా హెచ్చరించిన విధంగానే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన మొక్కజొన్న, సోయా దిగుమతులపై 15 శాతం సుంకం విధించింది.
ఫెంటనిల్ రసాయనాలను పక్కదారి పట్టకుండా అదుపు చేయడంలో చైనా విఫలమైందని అమెరికా ఆరోపిస్తోంది. దీని ద్వారా డ్రగ్స్ తయారు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు పలు మార్లు విరుచుకుపడ్డారు. చైనా నుంచి అమెరికాకు పెద్దఎత్తున ఫెంటనిల్ రూపంలో రసాయనాలు దిగుమతి అవుతున్నాయి. వాటిని డ్రగ్స్ తయారీలో ఉపయోగించడం వల్ల అమెరికాలో డ్రగ్స్ వాడకం విచ్చిలవిడిగా పెరిగిపోయిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
కెనడా కూడా అమెరికా సుంకాలపై ప్రతీకార చర్యలకు దిగింది. ట్రూడో ప్రభుత్వం తాజాగా అమెరికాపై 20 శాతం సుంకాలను విధించింది. అమెరికా నుంచి ఏటా కెనడా 107 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. తాజాగా సుంకాలు పెంచడంతో రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది.
ప్రతి వస్తువు అమెరికాలోనే తయారు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటూ ట్రంప్ పారిశ్రామికవేత్తకు సూచించారు. ఇందుకు అనుగుణంగా చౌకగా విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై సుంకాలను భారీగా ట్రంప్ ప్రభుత్వం పెంచింది. దీని వల్ల దేశంలోనే ఆయా వస్తువులు తయారు చేస్తారని భావిస్తున్నారు.