కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మణిపుర్ హింసలాంటి సమస్యలను తక్షణం భారత్ పరిష్కరించుకోవాలంటూ ఐరాసలో మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమపై టర్క్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని భారత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కుండబద్దలు కొట్టారు. జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల 58వ గ్లోబల్ సమిట్‌లో టర్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన భారత ప్రతనిధి బాగ్చీ, భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని గుర్తుచేశారు.
మణిపుర్ హింస, కశ్మీర్లో నిర్భంధ చట్టాల అమలు, పౌరులు కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరగకుండా ఆంక్షలు విధించారంటూ టర్క్ చేసిన వ్యాఖ్యలపై భారత ఘాటైన జవాబిచ్చింది.టర్క్ చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవని బాగ్చీ అన్నారు. భారత్‌పై చేస్తున్న నిరాధార ఆరోపణల్లో నిజం లేదనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే నిరూపించారని ఆయన స్పష్టంచేశారు. గ్లోబల్ అప్డేట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.