ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో అసభ్యంగా మాట్లాడినందుకు రణవీర్ మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటినుంచీ సొంత ఛానెల్‌లో వీడియోలు పెట్టుకోడానికి లేకుండా పోయింది. ఆ కేసుల విచారణ సందర్భంగా, రణవీర్ తన వీడియోలను అప్‌లోడ్ చేయడం ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవాళ సుప్రీంకోర్టు రణవీర్‌కు ఊరట కలిగించింది. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ది రణవీర్ షో (టిఆర్ఎస్)లో తన పాడ్‌కాస్ట్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునంటూ అనుమతి మంజూరు చేసింది. ఆ షో ఒక్కటే తన ఏకైక ఆదాయ మార్గం కాబట్టి దాన్ని కొనసాగించనివ్వాలంటూ రణవీర్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది.
రణవీర్‌కు పాడ్‌కాస్ట్‌ల ప్రసారానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఒక నిబంధన విధించింది. అతని పాడ్‌కాస్ట్‌లలో అన్ని వయస్సుల వాళ్ళూ కలిసి చూడగలిగే కంటెంట్ మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించింది. అలాగే, వివాదానికి దారి తీసిన ‘ఇండియాజ్ గాట్ లేటెంట్’ షో గురించి కానీ, తన వ్యాఖ్యల వల్ల రేగిన వివాదం గురించి కానీ మాట్లాడడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, భారతదేశం బైటకు ప్రయాణించడానికి అనుమతి కూడా ప్రస్తుతానికి నిరాకరించింది.
ఈ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు, నైతికతకూ మధ్య సమతూకం ఉండేలా చూసుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. డిజిటల్ కంటెంట్‌కు మార్గదర్శకాలు తయారు చేసేటప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత