పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఎదుగుదల కోసం అవస్థలు పడుతున్న భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన విజయం దక్కింది. నందిగ్రామ్ వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 12-0 గెలుపుతో తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టి కరిపించింది. నందిగ్రామ్ ప్రాంతంలో బీజేపీ ప్రభావం పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ఒకప్పుడు టీఎంసీ కంచుకోటగా నిలిచిన నందిగ్రామ్‌లో ఇప్పుడు కాషాయ ధ్వజం రెపరెపలాడుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో స్వయానా మమతా బెనర్జీనే బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. ఆ హవా ఇప్పటికీ కొనసాగుతోందనడానికి తాజా ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.
నందిగ్రామ్‌లో వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా తగిలాయి. నందిగ్రామ్ చాలా యేళ్ళపాటు టీఎంసీకి బలమైన కంచుకోటగా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ కార్పొరేషన్‌లో 12 స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్నింట్లోనూ బీజేపీయే గెలిచింది, టీఎంసీని దారుణంగా మట్టి కరిపించింది. ఈ ఫలితాలు స్థానిక ప్రజల రాజకీయ ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకప్పుడు టీఎంసీలో ఉన్న సువేందు అధికారి బీజేపీలోకి మారడంతో ఆ ప్రాంత ప్రజలు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ మొగ్గు ఇప్పుడు శాశ్వతంగా స్థిరపడేలా ఉంది. 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో సువేందు అధికారి నేరుగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతోనే తలపడ్డారు. ఆమెను ఓడించారు.
ఇప్పుడు వ్యవసాయ కార్పొరేషన్ ఎన్నికల్లో 12 స్థానాల్లో ఒక్కదానిలోనూ గెలవలేకపోవడం తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నీరసానికి గురిచేసింది. నందిగ్రామ్ ప్రాంతంలో టీఎంసీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. బీజేపీ వ్యూహాత్మక ప్రచారం, క్షేత్రస్థాయిలో చేసిన విశ్వప్రయత్నాలు, మూలాల దశ నుంచీ బలపడిన బీజేపీ వ్యవస్థ… ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి విజయాన్ని కట్టబెట్టాయి. ఇది స్థానిక ప్రజల విశ్వాసాల్లో సమూలంగా వచ్చిన మార్పుకు ప్రత్యక్ష నిదర్శనం. మార్పు తీసుకొస్తామన్న బీజేపీ వాగ్దానాల పట్ల, సువేందు అధికారి నాయకత్వం పట్ల ఓటర్ల విశ్వాసం పెరిగినందునే ఈ మహత్తరమైన విజయం సాధ్యమైంది.
ఈ ఫలితం ప్రభావం ఎలా ఉంటుంది? నందిగ్రామ్‌లో బీజేపీ 12-0 తేడాతో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడం పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మీద దీర్ఘకాలికమైన, విస్తృతస్థాయి ప్రభావం చూపించగలదు. ఒకప్పుడు టీఎంసీకి తిరుగులేని అడ్డాగా ఉండే నందిగ్రామ్‌లో ఇప్పుడు బీజేపీ ప్రభావం పెరుగుతోంది. అంతేకాదు, ఆ పార్టీ అధికార పక్షానికి చుక్కలు చూపించగల స్థాయికి ఎదిగింది. నందిగ్రామ్ ఫలితం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అనుకోలేము. మౌలికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా పరిగణించవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటుందో ఆ స్థానాల్లో బీజేపీ క్రమంగా తన ఉనికిని బలోపేతం చేసుకుంటోందనడానికి నందిగ్రామ్ కళ్ళముందరి సాక్ష్యం. ఇక టీఎంసీ విషయానికి వస్తే ఈ పరాభవం మింగుడు పడలేనిది. ఒకప్పుడు నందిగ్రామ్‌లో టీఎంసీని కన్నెత్తి చూసే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు అక్కడ ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ చూరగొనడం టీఎంసీకి, ముఖ్యంగా మమతా బెనర్జీకి చాలాపెద్ద సవాల్ అని చెప్పవచ్చు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత