భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ ఒక పోస్ట్ పెట్టారు. హిట్‌మ్యాన్ క్రికెటర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలిపై నెటిజెన్లు, బీజేపీ నాయకులు మండిపడ్డారు. దాంతో ఆమె తన పోస్ట్ తొలగించారు. అయితే దాని మీద వివరణ ఇస్తూ తాను సాధారణంగా మాట్లాడాననీ, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదని తెలుసుకోలేకపోయాననీ మళ్ళీ తలతిక్కగా మాట్లాడారు.
షమా మొహమ్మద్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్‌లో రోహిత్ శర్మను అవమానించారు. రోహిత్ శర్మ లావుగా ఉన్నారని, క్రీడాకారుల్లా లేరనీ ఆమె వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ బరువు తగ్గాలనీ, భారతదేశంలో ఇప్పటివరకూ ఏమాత్రం ఆకట్టుకోని కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ షమా వెక్కిరింపు వ్యాఖ్యలు చేసారు. ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో భాగంగా ఆదివారం జరిగిన భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ సందర్భంగా ఆమె ఆవిధంగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
పాకిస్తాన్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టాడు. రోహిత్ శర్మ బలవంతుడు, ప్రభావశీలి, ప్రపంచస్థాయి ఆటగాడు అంటూ కామెంట్ చేసాడు. అప్పుడైనా షమా ఆగలేదు. ‘‘గంగూలీ, టెండూల్కర్, ద్రావిడ్, ధోనీ, కోహ్లీ, కపిల్‌దేవ్, శాస్త్రి మొదలైన వారితో పోలిస్తే రోహిత్ అంత ప్రపంచ స్థాయి ఆటగాడేమీ కాదు. అతనో సాధారణ కెప్టెన్ అంతే. భారత జట్టు కెప్టెన్సీ అనే అదృష్టం లభించిన సాధారణ ఆటగాడు మాత్రమే’’ అని జవాబిచ్చారు.
షమా వ్యాఖ్యలపై నెటిజెన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆమె రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా షమా వైఖరిని తప్పుపట్టారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ‘‘కాంగ్రెస్‌కు సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ వెనకాల పడ్డారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో విఫలమయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నారా ఏమిటి?’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వివాదం ముదరడంతో షమా కొంతసేపటి తర్వాత ఆ పోస్ట్ తొలగించారు. దానిమీద వివరణ ఇచ్చేప్రయత్నమూ చేసారు. ఆ క్రమంలో కూడా ఆమె మళ్ళీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పోల్చి విరాట్ కోహ్లీయే గొప్ప క్రికెటర్ అని వ్యాఖ్యానించారు. ‘‘నేను మామూలుగా మాట్లాడేసాను. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి హక్కు లేదని నేను అర్ధం చేసుకోలేకపోయాను’’ అంటూ వక్రోక్తిగా మాట్లాడారు.