ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి, వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది.
ఇంటి పట్టున ఉండే మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేస్తారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాల్లోనూ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కులాలకు చెందిన 1,02,832 మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయడానికి రూ.255 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్లూఎస్ వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా అదే కులానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేస్తారు.
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ శిక్షణ 90 రోజుల పాటు కొనసాగనుంది. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కోరారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత