తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్‌సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ఎంఎల్‌సి నియోజకవర్గాలకు ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి సీటుకు ఓట్ల లెక్కింపు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ట్రిపుల్ ఇ విభాగం భవనంలో జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సీట్ ఓట్ల లెక్కింపు ఏలూరులోని సిఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతోంది. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు గుంటూరు నగరంలోని ఏసీ కాలేజీలో జరుగుతోంది.