ఇంగ్లండ పై ఏడు వికెట్ల తేడాతో విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ2025లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ కి వెళ్ళింది. లీగ్ దశలో గ్రూప్-బి విభాగం చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులు చేసింది. విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 29.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది.
క్లాసెన్ (64), వాన్ డర్ డుసెన్ ( 72) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ట్రిస్టాన్ స్టబ్స్ (0) డకౌట్ అవ్వగా ర్యాన్ రికెల్టన్ 27 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ పై విజయంతో గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా టాప్ లో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల ప్రత్యర్థులు ఎవరనేది నేడు జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. భారత్ గెలిస్తే.సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పోటీ పడతాయి. భారత్ ఓడితే సెమీస్ లో దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. మరో సెమీస్ లో ఆసీస్, కివీస్ మధ్య పోటీ ఉంటుంది.