శిశువులను విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భవానీపురంకు చెందిన బలగం సరోజిని గత కొంత కాలంగా ఉత్తరాది నుంచి పసిపిల్లలను, శిశువులను తీసుకువచ్చి విక్రయిస్తోంది. మగ శిశువును రూ.5 లక్షలకు, ఆడ శిశువును రూ.3 లక్షలకు విక్రయిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి రూ.50 వేల నుంచి లక్ష ఖర్చుతో కొనుగోలు చేసి రూ.5 లక్షలకు విక్రయిస్తోందని పోలీసులు తెలిపారు.
బలగం సరోజిని పసిపిల్లల విక్రయం కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. అయినా తీరు మార్చు కోలేదు. ఏడాది కాలంలో 26 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, ఏలూరుకు చెందిన వారికి విక్రయించినట్లు సరోజిని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మూడు బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించారు.
సరోజినితోపాటు ఆమెకు సహకరించిన వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేయనున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. జువైనల్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పసిపిల్లల విక్రయం కేసులో దాదాపు ఆరుమంది ఉన్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నారు.