అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యఅతిథులుగా హాజరై SCT ఎస్సైలకు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మెరుగైన పనితీరుతో ప్రజలకు సేవలందిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కఠిన సవాళ్ళను ఎదుర్కొంటూ మెరుగైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ కృషి ఎనలేనిదని ప్రశంపించారు.
సబ్-ఇన్ స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హోంమంత్రి అనిత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా నేరరహిత సమాజస్థాపన కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మానవ హక్కులు కాపాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకు అనుగుణంగా పని చేయడాన్ని ఎప్పుడు మరువకూడదని శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్సైలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. ప్రజలకు జవాబుదారీతనంగా నిజాయితీగా, అంకితభావంతో పారదర్శకంగా విధులు నిర్వర్తించడం ప్రతీ పోలీసుకు ముఖ్యమన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లోచేసిన ప్రతిజ్ఞ ను పదవీవిరమణ వరకు మరవకూడదన్నారు.