ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదార్లను తక్షణం బహిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. చొరబాటుదార్లు నివసించడానికి సెటిల్మెంట్లుగా ఏర్పడడానికి సహాయపడుతున్న ముఠాలను సైతం విచ్ఛిన్నం చేయాలని స్పష్టం చేసారు.
కేంద్ర హోంశాఖ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ఆ ఆదేశాలు జారీ చేసారు. దేశ రాజధానిలో నేరాల నియంత్రణ, 2020 ఢిల్లీ అల్లర్ల కేసుల సత్వర విచారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఆ సమావేశంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, హోంమంత్రి ఆశిష్ సూద్, పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
చొరబాటుదారులకు భారతదేశంలో ఆశ్రయం కల్పిస్తున్నవారిని గుర్తించాలి, వారికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భారతదేశపు పత్రాలు వచ్చేలా చేస్తున్న వారిని పట్టుకోవాలి. అలాంటి నెట్వర్క్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అమిత్ షా ఆదేశించారు.
ఢిల్లీ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశీ, రోహింగ్యా అక్రమ వలసదారులు నివసిస్తున్న కాలనీలను గుర్తించే సమగ్ర ఆడిట్ కార్యక్రమం మొదలైంది. వారికి భారత్లో నివాసం ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేసిన వారిని సైతం శిక్షించాలని స్పష్టంగా ఆదేశించారు. వాటి తక్షణ అమలు కోసం పోలీస్ స్టేషన్ స్థాయి వరకూ సూచనలు వెళ్ళిపోయాయి.