జాతుల మధ్య చెలరేగిన హింసతో రెండేళ్లుగా మణిపుర్ రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీరెన్‌సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, అధికారాలన్నీ గవర్నర్‌కు కట్టబెట్టారు. మణిపుర్లో మార్చి8 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. మణిపుర్ పరిస్థితులపై న్యూ ఢిల్లీలో మణిపుర్ గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా సహా పలువురు సైనిక అధికారులు, హోంశాఖ కార్యదర్శి, పలువురు అధికారులతో హోం మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.
మణిపుర్ ప్రజల వద్ద ఉన్న ఆయుధాలు పోలీసులకు అప్పగించాలని గవర్నర్ ఆదేశించారు. మరో వారంలో ఆయుధాలు అప్పగించకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే 300 మంది వారి ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. మార్చి 8 నుంచి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు.
రెండేళ్ల నుంచి జరుగుతున్న మణిపుర్ హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండు తెగల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో సీఎం విఫలం కావడంతో ఆయన రాజీనామాకు దారితీసిన సంగతి తెలిసిందే.