ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ దగ్గర మనా గ్రామం సమీపంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ మీద హిమాలయాల మంచుచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం ఇవాళ ధ్రువీకరించింది. ఇంకా ఐదుగురు వ్యక్తులు చరియల కింద ఇరుక్కుపోయి ఉన్నారు, వారిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శుక్రవారం ఉదయం 7.15 గంటలకు చోటు చేసుకున్న హిమపాతం కారణంగా కొండచరియలు విరిగి బీఆర్ఓ క్యాంప్‌కు చెందిన 8 కంటెయినర్లు, ఒక షెడ్ మీద పడ్డాయి. ఆ సమయంలో వారు ఇండో టిబెటన్ బోర్డర్ వద్ద ఆర్మీ రాకపోకలకు వీలుగా మంచును తొలగించే పనిలో ఉన్నారు. అనుకోకుండా మీద పడిపోయిన మంచులో వారు కూరుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది. నిన్న శుక్రవారం నాడు 33మంది కార్మికులను రక్షించారు, మరో 17మందిని ఇవాళ శనివారం రక్షించగలిగారు. ఐదుగురు కార్మికులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇవాళ కూడా వాతావరణం బాగోలేక సహాయకచర్యలు సరిగ్గా సాగడం లేదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి వివరించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనతో నిరంతరాయంగా చర్చిస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయం చేస్తామని ప్రధాని ఇప్పటికే హామీ ఇచ్చారు.