అక్రమ చొరబాటుదారులు పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో హైదరాబాద్ పోలీసులు నగరంలోని వేశ్యాగృహాలపై దాడులు చేసారు. ఆ క్రమంలో 18మందిని అరెస్ట్ చేసారు. వారిలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బంగ్లాదేశీ చొరబాటుదారులు కూడా ఉన్నారు. మూడు రోజుల క్రితం తన నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నోరు విప్పకపోవడం దేనికి చిహ్నం?
హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్-ఖైరతాబాద్ స్టేషన్ల పోలీసు సిబ్బంది కలిసి ఆ దాడులు జరిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం… నిందితులు మానవ అక్రమ రవాణా కోసం ఆర్గనైజ్డ్ నెట్వర్కే నడుపుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఆర్థికంగా సమస్యల్లో ఉన్న మహిళలను భారతదేశంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పిస్తున్నారు. వారిని నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలతో భారతదేశంలోకి అక్రమమార్గంలో తీసుకొస్తున్నారు. తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారు.
ఈ దర్యాప్తులో పట్టుబడిన ఇద్దరు బ్రోకర్లు కమారుల్ షేక్, అజారుల్ షేక్… బంగ్లాదేశీ మహిళలను పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి తీసుకొస్తున్నారు. భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసి వారికి నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు సమకూరుస్తారు. వారిని హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు చేరుస్తారు. ఆ వ్యవహారానికి ఈ బ్రోకర్లు తీసుకునేది రూ.15వేల నుంచి 20వేలు మాత్రమే.
అరెస్టయిన వారిలో అత్యధికులకు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది. పోక్సో, అంతకు మించిన తీవ్రమైన చట్టాల్లో చెప్పిన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పలు స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయి. మహమ్మద్ రోనీ ఖాన్ హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్లో ఓలా బైక్ రైడర్‌గా పనిచేసేవాడు. బంగ్లాదేశీయుడైన అతనిపై గతంలో ఇటువంటి కేసులే నమోదయ్యాయి. రితాజ్ ఇస్లాం సికింద్రాబాద్‌లో బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అతను కూడా గతంలో నేరాలకు పాల్పడ్డాడు.
బంగ్లాదేశీ చొరబాటుదారులు నగరంలో ఎలా స్థిరపడుతున్నారు, సాధారణ జనాలతో సంబంధం ఉండే ఉద్యోగాలు ఎలా సంపాదిస్తున్నారు అని నగర పౌరులు విస్తుపోతున్నారు. ఈ కేసులో పట్టుబడిన వారందరూ బైక్ రైడర్లు, బ్యూటీ పార్లర్ వర్కర్లు, టైలర్లుగా పనిచేస్తున్న వారే. వాళ్ళకు ఇక్కడ అవసరమైన పత్రాలు ఎలా వస్తున్నాయి? వారిని ఎవరు పని చేయనిస్తున్నారు? ఈ అక్రమ చొరబాటుదారులకు ఇస్లామిక్ మత సంస్థలు ఏవైనా సాయం చేస్తున్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘పాతబస్తీకి చెందిన ముస్లిం నాయకులు ఎక్కడున్నారు? ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు?’’ అని ప్రశ్నించారు. అక్రమ చొరబాట్లు అనేవి దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తు పైన దాడి కూడా అని హెచ్చరించారు. ఒక ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని, తెలంగాణ అంతటా3 అక్రమ చొరబాటుదార్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసారు.
ఈ బంగ్లాదేశీయులు ఇంత సులువుగా మన సమాజంలో కలిసిపోతుంటే ఇప్పటికి ఎంతమంది చొరబడిపోయారో, ఎవరికీ తెలియకుండా ఏయేం కార్యకలాపాలు చేస్తున్నారో, వాళ్ళ వల్ల భద్రతకు ఎంత ముప్పో అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. వారిని గుర్తించి, నిలువరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదార్లు పెరిగిపోతున్నారు. వారి సంఖ్య ఇప్పటికే లక్షల్లోకి చేరుకుని ఉంటుంది. వారంతా బాలాపూర్, పహాడీ షరీఫ్, హఫీజ్‌బాబా నగర్, కిషన్‌బాగ్ వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అవన్నీ అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రాంతాలే. అక్కడ ఎంఐఎం ప్రాబల్యం చాలా ఎక్కువ. ఆ బంగ్లాదేశీయుల, రోహింగ్యాల సెటిల్మెంట్లు అక్రమ కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ చొరబాట్లు అనేవి ఒక్కసారిగా వచ్చి పడినవి కావు. చాలాకాలంగా గుట్టుగా జరుగుతున్నవే. అందుకే స్థానిక ఎంఎల్ఏలు, ఎంపీ ఈ అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారని, వారి సంఖ్యను బలవంతంగా పెంచడం ద్వారా హిందువులను నిశ్చేతనం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనీ ఆరోపణలు వినవస్తున్నాయి.