55 మందిలో 47 మందిని రక్షించిన ఆర్మీ
ఉత్తరాఖండ్ లో భారీ హిమపాతం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని ఛమోలీ జిల్లా పరిధిలో మనా గ్రామం వద్ద శుక్రవారం మంచుచరియలు విరిగిపడి 55 మంది చిక్కుకుపోయారు. వీరిలో ప్రమాదం జరిగిన రోజున 33 మందిని రక్షించగా, తాజాగా మరో 14 మందిని ఆర్మీ రక్షించింది. మరో 8 మంది మంచుచరియల కిందే ఉన్నారు. దాదాపు ఏడుఅడుగుల మేర మంచు ఉండటంతో వారిని రక్షించేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది.
జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచును తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేడు ప్రమాదస్థలికి వెళ్ళి సహాయచర్యలపై ఆరా తీయనున్నారు.
హిమాలయ పర్వతశ్రేణుల్లో శీతాకాలంలో చరియలు 5 సెకన్ల కాలంలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారతాయి. దాదాపు 2.3 లక్షల ఘనపు మీటర్ల వరకూ మంచు విడుదలవుతుంది. శకలాల్లో చిక్కుకున్న వ్యక్తిని 18 నిమిషాల్లోగా కాపాడగలిగితే అతడికి ప్రాణాపాయం తప్పుతుంది. 35 నిమిషాలు దాటితే బ్రతికే అవకాశం 34 శాతానికి తగ్గిపోతుంది.