ఎస్‌ఎల్‌బిసి సొరంగం కప్పు కూలిన ఘటనలో 8 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక స్కానర్ పరికరాలతో బురదలో 3 అడుగుల లోతున కూరుకుపోయిన కార్మికులను గుర్తించినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికితీసేందుకు భారీగా బురదను తొలగించాల్సి ఉంది. ఇందుకు మూడు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో 13.85కి.మీ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. టీఎంబీ మిషన్‌పై పడటంతో దాన్ని ముక్కలుగా కోసి వెలికితీసుకువస్తున్నారు. సొరంగం కూలిన ఘటనలో టీఎంబీ మిషన్ ఆపరేటర్లు ఇద్దరు, ఇద్దరు ఇంజనీర్లు, నలుగురు కార్మికులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 42 మంది ఉండగా 34 మంది తప్పించుకోగలిగారు. మిగిలిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
సహయక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. దేశంలోని పలు సంస్థల ఇంజనీర్లు, వందలాది కార్మికులు 24 గంటలూ పనిచేస్తున్నారు. సొరంగంలో భారీగా బురదతోపాటు, నీరు ఉబికి రావడంతో వాటిని తొలగించడం పెద్ద సవాల్‌గా మారింది. మరో వారం రోజులు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశముంది.