కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ మాత్రమేనని వైయస్ఆర్సీపీ ఎంఎల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక సభ వాయిదా తరువాత అసెంబ్లీ బైట ప్రతిపక్ష ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని దూషించడానికి, చంద్రబాబు-లోకేష్‌లను పొగడ్తలతో ముంచెత్తడానికే బడ్జెట్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలేమీ లేకుండా, అరకొర కేటాయింపులతోనే బడ్జెట్‌ను ఆత్మస్తుతి-పరనిందతో నింపేసారని దుయ్యబట్టారు.
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వాన్ని దూషిస్తూ… సీఏం, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆశ్చర్యకరం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కేటాయింపులు లేవు. సూపర్ సిక్స్ అంటూ గొప్పగా నమ్మించారు. కేటాయింపులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. మహిళలకు ఉగాది నుంచి ఉచిత బస్సు అన్నారు. దీనిపై ఎక్కడా ప్రస్తావనే లేదు. మూలధన వ్యయంపై పొంతన లేకుండా చూపించారు. మార్కెట్ ఇంట్రవెన్షన్ ఫండ్ మేము 3వేల కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వంలో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు’’ అని విరుచుకుపడ్డారు.
ఉత్పాదక రంగానికి కేటాయింపులు లేవని ఎంఎల్‌సి కుంభా రవిబాబు మండిపడ్డారు. ‘‘ఏ రంగంలోనూ స్పష్టత లేకుండా కేవలం రూ.3.26 లక్షల కోట్లు అంటూ అంకెలను ప్రకటించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు సక్రమంగా లేవు. మూలధన వ్యయం గురించి అస్పష్టంగా పొందుపరిచారు. ఉత్పాదకరంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఆ రంగానికి కేటాయింపులు లేకుండా సంపద ఎలా సృష్టిస్తారు? సూపర్ సిక్స్ గురించి ఏ విషయం మీదా క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సుకు కేటాయింపులు లేవు. నిరుద్యోగులకు రూ.3వేల హామీపై ప్రస్తావనే లేదు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్ మాటల గారడీ మాత్రమే. ఏ వర్గానికీ ఎలాంటి ప్రయోజనమూ లేదు’’ అని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం మహిళలను వంచించిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘గత బడ్జెట్లోనూ ప్రజలను దారుణంగా మోసగించారు. ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో హామీల అమలుకు కేటాయింపులు చేస్తారని ప్రజలు ఆశించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. మేనిఫేస్టోలో పెట్టిన ఏ అంశాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. మహాశక్తి పథకంపై గొప్పగా చెప్పుకున్నారు. గత బడ్జెట్లోనూ మహాశక్తి పథకానికి నిధులు కేటాయించామని హోంమంత్రి చెప్పారు కానీ. గత బడ్జెట్లోనూ, నేటి పూర్తి బడ్జెట్లోనూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఈ బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. తల్లికి వందనం, రైతుభరోసాకు అరకొర నిధులు కేటాయించారు’’ అని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ అని బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ‘‘ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఏ మేరకు కేటాయింపులు చేసారో ఈ బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. ఆర్భాటంగా రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. తల్లికి వందనం గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా తక్కువగా కేటాయింపులు చేశారు ఈ పాలనను ప్రశ్నిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారు’’ అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ‘‘మంచి ఐఆర్ ఇస్తామని, పీఆర్సీ అమలు చేస్తామనీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ రెండూ ఈ బడ్జెట్లో జరుగుతాయని అందరూ ఆశగా ఎదురుచూసారు. దాని ప్రస్తావనే లేదు. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అని ప్రకటించి, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కేటాయింపులు లేవు. విద్యార్ధులకు గత ఏడాదికి సంబంధించి మూడు త్రైమాసికాల బకాయిలు చెల్లించలేదు. ఇప్పటి వరకు ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో పెట్టారు. పరీక్షల నేపథ్యంలో బకాయిల సాకుతో విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రాష్ట్రం అప్పుల పాలయ్యిందని గత ప్రభుత్వంపై నిందలు వేశారు’’ అని నిలదీసారు. ‘‘కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు గానూ ఏ పథకాన్ని అమలు చేయకుండానే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్లు అప్పులు చేస్తామని, గత ఏడాది రూ.98,576 కోట్లు అప్పులు చేశామని బడ్జెట్ లో ప్రకటించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు