అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా, ఐరోపా దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్, మరో 10 శాతం పెంచబోతున్నారనే వార్తలు పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీశాయి. ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే అంచనాలతో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్ 1414 పాయింట్ల నష్టంతో, 73379 వద్ద ముగిసింది. నిఫ్టీ 423 పాయింట్లు నష్టపోయి 22125 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు తొమ్మిది నెలల కనిష్ఠానికి పతనం అయ్యాయి. ఒక్క రోజులోనే మదుపరులు రూ.10 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు.ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి.
క్యూ3 ఫలితాలు నిరాశకు గురిచేయడం, క్యూ4 ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండే అవకాశం లేకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. చైనాలో తక్కువ ధరకు స్టాక్స్ అందుబాటులో ఉండటంతో పెట్టుబడులు తరలిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులు ఉపసంహరణతో, దేశీయ పెట్టుబడిదారులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ( #sensex30index ) అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, మారుతీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు 2 నుంచి 5 శాతం పడిపోయాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్ 78.5 డాలర్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.60గా ఉంది.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు